Call Us On +91- 9246377055

News

రేపటి నుంచి మరోసారి దోస్త్‌ రిజిస్ట్రేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు శుక్రవారం(ఈ నెల 9వ తేదీ) నుంచి మరోసారి దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులతో బుధవారం వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మరోసారి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశించారు. దాంతో దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి బుధవారం రాత్రి కాలపట్టికను విడుదల చేశారు. అనంతరం మిగిలిన సీట్లకు కళాశాలలు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించుకునేందుకు కూడా మంత్రి అంగీకారం తెలిపారు. ఇంటర్‌ విద్యపై చర్చ సందర్భంగా గతేడాది పలు కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చారని, ఈసారి ఏమీ మార్పు లేకున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రైవేట్‌ కళాశాలల సంఘం ప్రతినిధులు ప్రకాశ్‌, పరమేశ్వర్‌, రమణారెడ్డి తదితరులు ప్రశ్నించారు. ఇప్పటివరకు చేరిన విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు లాగిన్‌ కూడా ఇవ్వలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో లాగిన్‌ ఇచ్చేందుకు ఇంటర్‌బోర్డు అధికారులు అంగీకరించినట్లు సమాచారం. ఒక కళాశాలలో కొంత భాగం షెడ్లలో ఉన్నా వాటి స్థానంలో పక్కా భవనం నిర్మాణానికి కొంత సమయం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంటర్‌ విద్యార్థులకు ఇచ్చే బోధన రుసుములను పెంచుతామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినందున దానిపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగదీశ్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌, దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

దోస్త్‌ కాలపట్టిక
ఈ నెల 9-13వ తేదీ వరకు: దోస్త్‌ రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు
14వ తేదీ: సీట్ల కేటాయింపు
14-16వ తేదీ వరకు: ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం