Call Us On +91- 9246377055

News

6,700 సీట్లు పెరిగాయి..! ఈడబ్ల్యూఎస్‌తో అదనం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఊరట

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 6,700 ఇంజినీరింగ్‌ సీట్లు పెరిగాయి. ఆర్థిక బలహీన వర్గాల కోటా (ఈడబ్ల్యూఎస్‌) కింద కన్వీనరు సీట్లు 10 శాతం అదనంగా భర్తీ చేయనున్నారు. దీంతో విద్యార్థులకు ఊరట కలగనుంది. కోరుకున్న కళాశాలల్లో సీటు పొందడానికి మార్గం సుగమమైంది. మన జిల్లాలోనే 600 సీట్లు పెరగనున్నాయి. జేఎన్‌టీయూలో 36, ఎస్కేయూలో 30 సీట్లను అదనంగా కేటాయించారు.

ఇతర కోర్సుల్లో ఇలా..
వర్సిటీ పరిధిలో బీఫార్మసీలో 377, ఎంటెక్‌లో 652, ఎంఫార్మసీలో 166, ఎంబీఏలో 1200, ఎంసీఏలో 150, ఫార్మాడీలో 15 సీట్లు తాజాగా పెరగనున్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో పాటు రెండో విడత కౌన్సెలింగ్‌ విద్యార్థులకు ఈనెల 14న సీట్లు కేటాయించనున్నారు. విద్యార్థులు 10, 11, 12 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు గతంలో సీట్లు నచ్చని వారు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరైన వారు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్‌ చేసుకోవచ్చు. లేదంటే జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్‌ కళాశాలలోని సహాయ కేంద్రాలకు రావచ్చని ప్రవేశాల సంచాలకులు గిరిప్రసాద్, పాలిటెక్నిక్‌ సహాయ కేంద్రం సమన్వయకర్త వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.