Call Us On +91- 9246377055

News

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ‍్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్‌ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంటర్నల్స్‌ స్లైడింగ్‌ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు.

ఫలితాలతో పాటు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. సీబీఎస్‌ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ర్యాంక్‌లు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీల్లో ప్రమాణలు పెరుగుదలతో ఇంజినీరింగ్‌ ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు. కాగా తెలంగాణ ఎంసెట్‌ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారితంగా ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు.

  • తెలంగాణ ఎంసెట్ ఫలితాలను Sakshi Education వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.