Call Us On +91- 9246377055

News

విదేశాల్లో వైద్యవిద్యకూ నీట్‌

ఈనాడు- హైదరాబాద్‌: మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్యను అభ్యసించాలన్నా జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సిందే. 2019-20 వైద్యవిద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. 2018-19 సంవత్సరం నుంచే విదేశాల్లో వైద్యవిద్యకు నీట్‌ అర్హత తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీచేసినా.. హఠాత్తుగా జారీచేసిన ఉత్తర్వుల కారణంగా తాము నష్టపోతామని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున వినతులు రావడంతో కేంద్రం ఆ ఏడాదికి సడలించింది. ఈ దఫా నీట్‌ మార్గదర్శకాల్లోనే ఈ నిబంధనను పొందుపర్చింది. ఇక నుంచి చైనా, రష్యా తదితర దేశాల్లో ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే విద్యార్థులు నీట్‌కూ సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైతేనే వారి విదేశీ వైద్యవిద్యకు మార్గం సుగమమవుతుంది. ఈ నిబంధనకు కారణముందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలో కనీస అర్హత సాధించని విద్యార్థులు.. విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించడం వల్ల నాణ్యతా ప్రమాణాలు కరవవుతున్నాయని, విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసి మన దేశానికి వచ్చిన వారిలో దాదాపు 70 శాతానికి పైగా అభ్యర్థులు ఇక్కడ నిర్వహించే అర్హత పరీక్షలో తొలివిడతలోనే ఉత్తీర్ణత సాధించడం లేదనేది వారి విశ్లేషణ. విదేశాల్లోనే కాదు.. అఖిల భారత వైద్యవిద్య కోటా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సీట్లు, కేంద్ర వైద్య సంస్థలు, ప్రైవేటు వైద్యవిద్య సంస్థలు.. వీటిల్లో ఎక్కడ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య సీటును పొందాలన్నా నీట్‌లో ఉత్తీర్ణులవ్వాల్సిందేనని మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టీకరించింది. 
ఇవీ మార్గదర్శకాలు

-  15 శాతం సీట్లను అఖిల భారత వైద్యవిద్య సీట్ల కోటాలో భర్తీ చేస్తారు. 
-  నీట్‌ పరీక్షను దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ వీడియో చిత్రీకరిస్తారు. 
-  ఈ దఫా ఆంగ్లం, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒరియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్న పత్రాలను రూపొందిస్తున్నారు. 
-  అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. 
-  ఒకసారి ప్రశ్నపత్రం ఏ భాషలో రాయాలనేది ఎంచుకున్న తర్వాత మార్చడం కుదరదు. 
-  అభ్యర్థి ఆంగ్ల ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసుకుంటే ఆంగ్లమాధ్యమంలో రూపొందించిన ప్రశ్నపత్రాన్ని మాత్రమే అందజేస్తారు. 
-  హిందీ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసుకుంటే హిందీతో పాటు ఆంగ్ల ప్రశ్నపత్రాన్నీ ఇస్తారు. 
-  అభ్యర్థి ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసుకుంటే.. ఆ భాష ప్రశ్నపత్రంతో పాటు ఆంగ్ల ప్రశ్నపత్రాన్ని కూడా అందజేస్తారు. 
-  ప్రాంతీయ భాష ప్రశ్నపత్రాల్లో అనువాద దోషాలేమైనా ఉంటే.. ఆంగ్ల ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు.

పరీక్ష కేంద్రాలు.. 
ఆంధ్రప్రదేశ్‌లో: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. 
తెలంగాణలో: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌. 
ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఒక తప్పు ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కుల నుంచి తొలగిస్తారు.

దరఖాస్తులు షురూ 
దరఖాస్తులు ఈ నెల 1 నుంచే ప్రారంభమయ్యాయి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 
01.11.18 నుంచి 
30.11.18 వరకు 
రుసుము చెల్లింపు: 
01.11.18 నుంచి 
01.12.18 వరకు

రుసుము వివరాలు 
అన్‌ రిజర్వుడ్‌, ఓబీసీకి రూ.1400 
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌కి రూ.750 
దరఖాస్తుల్లో తప్పొప్పులను ఆన్‌లైన్‌లోనే సరిచేసుకోవాలి: 14.01.2019 నుంచి 31.01.2019 వరకు 
పరీక్ష తేదీ: 05.05.2019 (ఆదివారం) 
పరీక్షా సమయం: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 
ఫలితాల వెల్లడి: 05.06.2019 లోపు.