Call Us On +91- 9246377055

News

వార్షిక వేతనం 25,00,000

ఐఎస్‌బీ విద్యార్ధులకు ‘ప్రాంగణ (కేంపస్‌) నియామకాల్లో’ ఎంతో ఆకర్షణీయమైన ఉద్యోగాలు వస్తున్నాయి. భారీగా జీతభత్యాలు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. హైదరాబాద్‌, మొహాలీలో కేంపస్‌లు ఉన్న ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) విద్యార్థులను ఉద్యోగాల్లో తీసుకునేందుకు ఈసారి అగ్రగామి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఐఎస్‌బీ 2019 బ్యాచ్‌ పీజీపీ (పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌) విద్యార్థులకు ఇప్పటి వరకూ జరిగిన కేంపస్‌ నియామకాల్లో సగటున రూ.25.06 లక్షల వార్షిక వేతనం లభించింది. కేంపస్‌ నియామకాలు ప్రారంభమైన మొదటి వారంలోనే 1194 ఉద్యోగాలను కంపెనీలు ఇవ్వజూపాయి. అంతేగాక నియామకాల కోసం వచ్చిన కంపెనీల సంఖ్య కూడా గత ఏడాదితో పోల్చితే ఈసారి 29 శాతం అధికంగా ఉన్నట్లు ఐఎస్‌బీ వెల్లడించింది.

వచ్చిన కంపెనీలు ఇవీ... 
అమెజాన్‌, బెయిన్‌, బీసీజీ, డెలాయిటీ, గూగుల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్‌ఈకే కన్సల్టింగ్‌, మెకిన్సే, మైక్రోసాఫ్ట్‌, ఓయో రూమ్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, శ్యామ్‌సంగ్‌, ఉబెర్‌, రివిగో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఐఎస్‌బీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. 
బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌) రంగాలకు చెందిన కంపెనీల సంఖ్య ఈసారి అధికంగా ఉంది. బార్క్లేస్‌, సిటీ బ్యాంక్‌, క్రెడిట్‌ స్యూస్సే, హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మాట్రిక్స్‌... తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. 
బహుళ జాతి కంపెనీలైన యాపిల్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌, గ్రాబ్‌ ట్యాక్సీ, లీ అండ్‌ ఫంగ్‌... మధ్య ప్రాచ్యం, హాంగ్‌కాంగ్‌, ఉత్తర ఆఫ్రికా, సింగపూర్‌ దేశాల్లో ఉద్యోగాలు ఇవ్వజూపుతున్నాయి. 
బిజాంగో, కార్స్‌24, మాజిక్‌పిన్‌, పేటియం, షటిల్‌, స్విగ్గీ, ఉడాన్‌, జొమాటో.. వంటి స్టార్టప్‌ కంపెనీలు కూడా అధికంగా కేంపస్‌ నియామకాల ప్రక్రియలో పాల్గొంటున్నాయి.

పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగాలు! 
ఆసక్తికరంగా ఈసారి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఐఎస్‌బీ విద్యార్థులను తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో పంజాబ్‌ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. పంజాబ్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ (ఇన్వెస్ట్‌ పంజాబ్‌)తో పాటు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వ ప్రతినిధులు ఈసారి ఐఎస్‌బీలో కేంపస్‌ నియామకాల్లో పాల్గొంటున్నారు.

కన్సల్టింగ్‌ ఉద్యోగాలే ఎక్కువ 
ఈసారి ఐఎస్‌బీ విద్యార్థులకు ఇప్పటి వరకూ వచ్చిన ‘ఆఫర్లను’ పరిశీలిస్తే కన్సల్టింగ్‌ ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం ఆఫర్లలో కన్సల్టింగ్‌ ఉద్యోగాలు 26.21 శాతం ఉన్నాయి. ‘ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌’ ఉద్యోగాలు 15.16 శాతం, అమ్మకాలు- మార్కెటింగ్‌ ఉద్యోగాలు 12.14 శాతం, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలు 11.73 శాతం ఉన్నాయి. ఫైనాన్స్‌ ఉద్యోగాలు 9.13 శాతం ఉన్నట్లు ఎస్‌బీఐ వివరించింది.

ఇదీ 2019 బ్యాచ్‌... 
ఐఎస్‌బీలో 2019 బ్యాచ్‌ పీజీపీ ప్రోగ్రాంలో హైదరాబాద్‌, మొహాలీ కేంపస్‌లలో 886 మంది విద్యార్థులు ఉన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు కోర్సు పూర్తయిన తర్వాత తాము ఎంచుకున్న రంగాల్లో విశేష ప్రతిభ చూపి ఎంతో ఉన్నతస్థానాలకు ఎదుగుతున్నట్లు ఐఎస్‌బీ ఇక్కడ వెల్లడించింది. ఈ విషయంలో  ఫైనాన్షియల్‌ టైమ్స్‌- 2018 గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకుల ప్రకారం ఐఎస్‌బీ మొదటి 100 బీ-స్కూళ్ల జాబితాలో ఉంది. ఐఎస్‌బీ- పీజీపీ ప్రోగ్రాం పూర్తిచేసిన తర్వాత మూడేళ్లకు విద్యార్ధుల జీతభత్యాల్లో 164 శాతం పెరుగుదల కనిపించింది. ఒకేసారి కాకుండా ‘రోలింగ్‌ ప్లేస్‌మెంట్స్‌’ విధానాన్ని ఐఎస్‌బీ నిర్వహిస్తుంది. 2019 బ్యాచ్‌ విద్యార్థులకు వచ్చే ఏడాది మార్చి వరకూ ప్లేస్‌మెంట్లు కొనసాగుతాయి.