Call Us On +91- 9246377055

News

నాలుగేళ్లలో 787 కళాశాలల మూత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో భారీగా కళాశాలలు మూతపడ్డాయి. డిగ్రీ, బీటెక్‌, బీఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులను అందించే కళాశాలల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా.. అదే సమయంలో సంప్రదాయ పీజీ కళాశాలలు, ఫార్మా-డి కళాశాలలు స్వల్పంగా పెరిగాయి. మొత్తం 787 కళాశాలలు మూతపడినట్లు తేలింది. కొత్త విద్యా సంవత్సరానికి(2019-20) ప్రవేశ పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉన్నందున ఆయా కళాశాలల పరిస్థితిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గణాంకాలను సేకరించింది. ఆ ప్రకారం 2014-15లో రాష్ట్రంలో 3,688 ఉన్నత విద్య కళాశాలలు ఉండగా 2018-19 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి వాటి సంఖ్య 2,901కి తగ్గిపోయింది. అత్యధికంగా 178 డిగ్రీ కళాశాలలు తగ్గాయి. దీనిపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రవేశాలు లేనందున స్వచ్ఛందంగా కళాశాలలు మూసేసుకుంటున్నారని, తాము బలవంతంగా ఏ ఒక్కటీ మూసివేయలేదని చెప్పారు.

ముఖ్యాంశాలు ఇవీ..
2014-15లో 337 ప్రభుత్వ కళాశాలలుండగా ఈ విద్యాసంవత్సరం 395కు పెరిగాయి.
2014-15లో మొత్తం సీట్లు 5,23,291 ఉండగా నేడు 6,52,178కి పెరిగాయి. కళాశాలలు భారీగా తగ్గినా సీట్లు మాత్రం పెరగడం గమనార్హం. అదే సమయంలో ప్రవేశాలు పొందినవారు 3,77,344 నుంచి 3,97,225కి పెరిగారు. బీటెక్‌లో 61,909 నుంచి 68,296కు పెరిగారు. ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థల్లో చేరిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకొంటే 2014-15లో వేలల్లో పెరిగే ఉంటారని అంచనా వేస్తున్నారు.