• +91 92463 77055
  • info@kabconsultants.com
  • 92463 77055

Success Stories

సివిల్స్ 2012 టాపర్ ప్రిన్స్ ధావన్

జీవితంలో ప్రతి సంఘటనను సానుకూల దృక్పథంతో చూడాలనేది నా అభిమతం. మనసులో ఏదీ దాచుకోను. సివిల్స్‌కు ఎంపిక అయ్యాననే విషయం తెలిశాక మొదట నాకు చాలా సంతోషం వేసింది. నేను పడిన కృషికి లభించిన ప్రతిఫలంగా దీన్ని భావిస్తున్నాను. ఇప్పుడు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది.
* కుటుంబ సభ్యుల ప్రోత్సాహం
మా నాన్న కమిషనర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్‌గా పనిచేస్తున్నారు. నేను ఐఐటీ, ఢిల్లీ నుంచి డిగ్రీ చేశాను. 9వ తరగతిలో ఉండగానే సివిల్స్‌పై అవగాహన పెంచేందుకు మా నాన్నగారు కృషి చేశారు. అమ్మ, అన్నయ్య పరీక్ష ప్రిపరేషన్‌లోనే కాదు, జీవితంలోకూడా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. అన్ని విషయాల్లో అండగా నిలిచారు.
సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడంలో భాష ఒక అవరోధంగా మారుతుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా 'ఇంగ్లిష్ మీడియం'లో చదివిన వారికి సివిల్స్ తేలిక అని విద్యార్థులు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. భాష ఏదైనా కావచ్చు. లక్ష్య సాధన దిశగా మనం ప్రణాళికాబద్ధంగా కృషి చేశామా లేదా అన్నదే ముఖ్యం. ప్రస్తుతం యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్స్ పరీక్ష విధానం కూడా సరైన పంథాలోనే ఉంది. ఈ పరీక్షను ఒక సవాల్‌గా తీసుకునే విధంగా యూపీఎస్సీ నిర్వహించడం అందరూ ఆహ్వానించదగినదే.
* నా బలాలు, విజయానికి దోహదపడిన అంశాలు...
1) బాగా కష్టపడటం.
2) పట్టుదల
3) దేనినీ తేలికగా తీసుకోకపోవడం.
4) భగవంతుడి మీద నమ్మకం.
5) సహనం
ఇవే సివిల్స్‌లో నన్ను విజేతగా నిలబెట్టాయి. ఎవరైనా సరే ఓటమి వచ్చినా కుంగిపోకూడదు. శ్రద్ధగా, ఓపికతో, నమ్మకంతో, పట్టుదలతో కృషి చేయాలి. అప్పుడే అంతిమ విజయం మనదవుతుందని నా నిశ్చిత అభిప్రాయం.
* సివిల్స్‌లో నా ఆప్షన్లు:
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లను ఆప్షనల్స్‌గా ఎంచుకున్నాను. ఆప్షనల్స్ ఎంపిక అనేది కేవలం అభ్యర్థి ఆసక్తి మీదే ఆధారపడి ఉండాలి. ఆయా సబ్జెక్టుల అధ్యయనంపై అతని వైఖరి కూడా ముఖ్యం. అంతేగానీ ఇతరులు ఎంపిక చేసుకున్నవి మనం కూడా ఎంపిక చేసుకుందామని అనుకోకూడదు.
* ప్రిపరేషన్ విధానం:
కంపల్సరీ పేపర్లను సాధన చేయడానికి ప్రతిరోజూ దినపత్రికలు చదివాను. ముఖ్యంగా జనరల్ స్టడీస్ కోసం పత్రికలతోపాటు ఇంటర్‌నెట్‌లోనుంచి సమాచారాన్ని సేకరించాను. వివిధ మ్యాగజైన్లలో ఒకే అంశంపై వచ్చిన సమాచారాన్ని పరిశీలించి ముఖ్యమైన పాయింట్లను నోట్‌చేసుకున్నాను. పోటీ పరీక్షల మ్యాగజైన్లలో ప్రచురితమయ్యే వ్యాసాలు సైతం తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందించాయి. ఇవి చదువుతున్నప్పుడు మనం కూడా ఆ విధంగా వ్యాసాలు రాయాలనే ఉత్సాహం కలుగుతుంది. ఇది అవసరం కూడా. పరీక్ష తేదీ సమీపిస్తున్నకొద్దీ టెస్ట్ పేపర్ల సాధనకు ఎక్కువ సమయం కేటాయించాను. దీనివల్ల పరీక్ష హాల్లో ఏ విధమైన వాతావరణానికి లోనవుతామో విడిగా కూడా అదే స్థితికి లోనయ్యాను. మోడల్ పేపర్ చేస్తున్నా 'నిజంగానే పరీక్ష రాస్తున్నాను' అని భావించాను. ఇక ఇంటర్వ్యూకు వెళ్లబోయే ముందు నేను పోటీ పరీక్షల మ్యాగజైన్లలో వచ్చిన సివిల్స్ విజేతల ఇంటర్వ్యూలను బాగా చదివాను. ఇంటర్వ్యూ సభ్యుల ఎదుట ఎలా ఉండాలి? ఎలాంటి ప్రశ్నలు వారినుంచి వస్తాయి? వాటిని ఎలా స్పందించాలి.. వంటి అనేక విషయాలను తెలుసుకున్నాను. గత విజేతల ఇంటర్వ్యూలు చదవడం ద్వారా ఇంటర్వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. మనపై మనకు నమ్మకం అధికమవుతుంది. ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగుతుంది.
* ఇంటర్వ్యూ బోర్డు గురించి...
ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు బాగా చదువుకున్న వారు. తమ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తినీ గౌరవించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడారు. బోర్డు సభ్యుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంటర్వ్యూ బోర్డును గమనించిన తర్వాత నాకు ఏర్పాడిన అభిప్రాయం - నిజాయితీయే విజయానికి బలమైన పునాది.
* నా సలహా
సివిల్స్‌లాంటి ఉన్నత స్థాయి పరీక్షల్లో విజయం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు కేటాయించాలనేది అభ్యర్థి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. సమయం సంగతి ఎలా ఉన్నా పరీక్ష మీద, సబ్జెక్టులపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. తన మీద తనకు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి.
విజయానికి దగ్గరి దారులేవీ లేవని ప్రతి అభ్యర్థి గుర్తించాలి. ఎప్పుడూ సందర్భోచితంగా వ్యవహరించాలి. తెలివితేటలను పెంపొందించుకోవాలి. అలాగే సహనాన్ని ఏ మాత్రం కోల్పోకూడదు. అనుకున్న లక్ష్యం మీదే మనసు కేంద్రీకరిస్తూ ప్రతి క్షణాన్ని దానికోసమే కేటాయించాలి. కఠిన శ్రమ పడటమే కాదు, తెలివిగా కష్టపడటం అవసరమని గుర్తించండి. దీనివల్ల తక్కువ సమయంలో విజయాన్ని చేరుకోవచ్చు.

Rating
0 /5 (0   Votes)
Review

Post Reviews
Views (3003)