రాష్ట్రపతి అవార్డు...గూగుల్ ఉద్యోగం!
లక్ష్యం బలంగా ఉంటే... గడ్డిపరక కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది.
ఆ లక్ష్యానికి ఆసక్తీ తోడైతే... ప్రపంచం ప్రయోగాలకు వేదిక అవుతుంది. అప్పుడు ఏ పనిచేసినా విజయాలు తోడవుతాయి. అందుకు ఈ అమ్మాయే ఉదాహరణ. రూ. 1.20 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్ ఉద్యోగం అందుకుని, కాలేజీలో తన ప్రతిభతో రాష్ట్రపతి అవార్డు అందుకుని ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపు తిప్పుకొంది. ఆమే వికారాబాద్‌కి చెందిన కుడుగుంట స్నేహారెడ్డి.
విశ్లేషణతోనే విజ్ఞానం: ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మక ధోరణిలో అర్థం చేసుకోవడం నాకు అలవాటు. ఒక్కసారి ఇలా నేర్చుకుంటే పదే పదే వాటిని వల్లెవేయాల్సిన అవసరం రాదు. అదే నన్ను మిగతావారికంటే భిన్నంగా నిలిపింది. నాకు నచ్చని పనిని ఎట్టిపరిస్థితుల్లోనూ చేయను. నచ్చిన పనిని మాత్రం ఎంత కష్టమైనా చాలా ఇష్టంగా పూర్తి చేస్తా. అన్ని తరగతుల్లోనూ టాపరే. అలాగనీ ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకొని కూర్చోలేదు. నేను పాఠ్యపుస్తకాలతో సమానంగా పెయింటింగ్స్, రచనలకూ సమయం కేటాయించా. సాధించిన కొన్ని విజయాలతోనే సంతృప్తి చెందకూడదనే మనస్తత్వం నాది.
సులభంగా ఎదుర్కోగలిగా...!
బీటెక్ చదివే సమయంలో రెండేళ్లపాటు ఐఐటీ హైదరాబాద్‌లో లిటరరీ సొసైటీకి సంబంధించిన అధికారిక మ్యాగజైన్ ‘లెక్సికాన్’కు చీఫ్ ఎడిటర్‌గా పనిచేశా. దీనివల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది. నేనూ ఇందులో రకరకాల వ్యాసాలు రాసేదాన్ని. ఇందుకోసం ఎంతో సమయం వెచ్చించాల్సి వచ్చినా చాలా ఇష్టంతో చేసేదాన్ని. 2008లో ‘నాసా’ నిర్వహించిన ఛాలెంజ్‌లో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో నిలిచా. ఆ సమయంలో నాసాను ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. అబ్దుల్ కలామ్ గారిని కూడా చూడగలిగా.
సమాచారం తక్కువ సమయంలో...
బీటెక్ చదువుతున్నప్పుడు భిన్న దేశాల్లోని శాస్త్రవేత్తలు, సంస్థలతో కలిసి పనిచేసేలా ఇంటర్న్‌షిప్‌లు ఎంచుకున్నా. 2016 లో అమెరికాలో సాగుతున్న పరిశోధనలన గురించి తెలుసుకునేందుకు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా 36 మందికి అవకాశమిస్తే... ఆ జాబితాలో నేనూ ఉన్నా. అనితా బోర్గ్ స్మారక స్కాలర్‌షిప్‌నూ సాధించా. ఇలా చదువుకుంటూనే పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయడం కలిసొచ్చింది. అందుకే గూగుల్‌లో ఉద్యోగం కోసం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎలాంటి బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వగలిగా. అదే నాకు విజయాన్ని తెచ్చిపెట్టింది. గూగుల్ చేపట్టిన నేచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్ ప్రాజెక్టులో భాగంగా చేరా. లక్షల కొద్దీ పేజీల్లో ఉన్న సమాచారాన్ని చాలా తక్కువ సమయంలో సమర్థంగా విశ్లేషించే అంశమై పరిశోధనలు సాగించనున్నాం. ఇందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఆధారం చేసుకోనున్నాం.